Land Survey

Land Survey: 3 ప్రత్యేక బృందాలతో.. ఎర్రవల్లిలో 3వ రోజు రెవెన్యూ అధికారుల సర్వే

Land Survey: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిసరాల్లో రెవెన్యూ అధికారుల భూ సర్వే శనివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఇటీవల తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. మొత్తం మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల హద్దులను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు.

సర్వే నంబర్ 325పై ప్రత్యేక దృష్టి – శాటిలైట్ టెక్నాలజీతో పరిశీలన..

ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 325 పరిధిలోని భూములను అధికారులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే శాటిలైట్ ఇమేజరీ సాంకేతికతను వినియోగించి సర్వే నంబర్ 325 హద్దులను ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ప్రస్తుతం గ్రౌండ్ లెవల్‌లో కొలతలు వేస్తున్నారు.
సర్వే నంబర్ 325లోని మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి? అనే లెక్కలను సర్వేయర్లు తేలుస్తున్నారు. ఈ క్రమంలో అసైన్డ్ భూముల హద్దులకు (బౌండరీలకు) ప్రత్యేక మార్కింగ్ వేసే ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
స్థానిక రైతుల అభ్యంతరాలు..

అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి అసైన్డ్ భూములను గుర్తిస్తూ మార్కింగ్ వేస్తున్న నేపథ్యంలో స్థానిక రైతులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి హద్దుల నిర్ధారణపై ఆందోళన చెందుతూ సర్వే అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *