Hyderabad: మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్లో గుండెలు పసివాడి ప్రాణాల మీదకు తెచ్చింది ఓ మహిళ. తన కొడుకును ఇంట్లో సరిగ్గా చూడటం లేదనే అక్కసుతో, తోడికోడలి నాలుగేళ్ల కుమారుడికి కిరాతకంగా యాసిడ్ తాగించింది. ఈ దారుణ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం కుటుంబంలో వివక్ష చూపుతున్నారనే చిన్న కారణంతో పసివాడిపై ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో నివసించే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే, తన పెద్ద కొడుకు కుమారుడిపై (4) మామగారు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని, తన బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల మనసులో కక్ష పెంచుకుంది. ముఖ్యంగా మామగారు తన చేతిపై పెద్ద మనవడి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవడంతో ఆమె ఓర్వలేకపోయింది. ఎలాగైనా ఆ పిల్లాడిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది.
గతంలో కూడా ఆ పిల్లాడిని ఊపిరి ఆడకుండా చేయడం, మేడపై నుంచి కింద పడేయాలని చూడటం వంటి ప్రయత్నాలు చేసింది. అయితే కుటుంబ సభ్యులు గమనించడంతో అప్పట్లో ప్రమాదం తప్పింది. కానీ, ఈ నెల 9న ఎవరూ లేని సమయంలో పిల్లాడిని కిచెన్లోకి తీసుకెళ్లి, ‘జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తాను’ అని నమ్మించి యాసిడ్ తాగించింది. పిల్లాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
