Shamshabad Airport 

Shamshabad Airport: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 109 మంది ప్రయాణికులు సేఫ్..!

Shamshabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో శుక్రవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబయి బయలుదేరిన ఎయిర్ ఇండియా ‘AI-417’ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. గగనతలంలోకి వెళ్లిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బందికి సమాచారం అందించారు.

విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయం వైపు మళ్లించిన పైలట్, చాకచక్యంగా రన్‌వేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా నేలను తాకడంతో ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న మొత్తం 109 మంది ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊరట చెందారు. ల్యాండింగ్ పూర్తయిన వెంటనే గ్రౌండ్ ఇంజినీరింగ్ టీమ్ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టింది. సాంకేతిక లోపం తలెత్తడానికి గల ఖచ్చితమైన కారణాలపై ఎయిర్‌లైన్స్ అధికారులు, డీజీసీఏ పరిశీలిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *