School Teachers: రాష్ట్రంలోని ప్రభుత్వ – ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో శారీరక దండన సంఘటనలను నివారించాలని, తప్పు చేసిన ఉపాధ్యాయులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా విద్యా అధికారులను (DEO) ఆదేశించింది. ప్రభుత్వ – ప్రైవేట్ పాఠశాలల్లో శారీరక దండన సంఘటనలపై కఠినమైన నిఘా ఉంచాలని సూచించింది. అలాగే వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (DPI) తన ఉత్తర్వులో DEOలను కోరింది.
విద్యార్థులను కొట్టడం శిక్షార్హమైన నేరమని, దీనికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. తప్పనిసరి విద్య చట్టం ప్రకారం విద్యార్థులను శారీరకంగా, మానసికంగా హింసించడం, వివక్ష చూపడం నిషేధించబడిందని DPI ఉత్తర్వులో పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థులకు విధించే శారీరక శిక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్ బాలల రక్షణ కమిషన్ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వెలువడింది.