Sajjanar: సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహనా లోపమే ప్రధాన కారణమని ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ అన్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘డిజిటల్ అరెస్ట్ అనేది అసలే ఉండదు’’ అని స్పష్టం చేసిన సజ్జనార్, దర్యాప్తు అధికారులు నేరుగా వచ్చి నేరస్తులను అరెస్ట్ చేస్తారని అన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే, అది మోసమని గుర్తించాలని సూచించారు.
అదే విధంగా, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవని తెలియజేస్తూ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడవని చెప్పారు. ఎవరైనా బెదిరిస్తే వారు నకిలీ వ్యక్తులుగా గుర్తించి వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మోసాలు జరిగిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
‘‘సోషల్ మీడియా సందేశాలు లేదా అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పకండి. సైబర్ మోసగాళ్లను నిరోధించడంలో జాగ్రత్త కీలకం’’ అని అన్నారు.

