Viral News

Viral News: బీహార్ యువకుడితో ప్రేమ.. ఇండియా వచ్చేసిన రష్యా యువతి

Viral News: ప్రేమకు ప్రాంతీయ భేదాలు, భాషలు, దేశాల సరిహద్దులతో పనిలేదని మరోసారి నిరూపితమైంది. ప్రేమ నిజమైనదైతే సంపదలు, సౌకర్యాలు కూడా ముఖ్యం కాదని చాటిచెబుతూ రష్యాకు చెందిన ఓ యువతి ఏకంగా వేల కిలోమీటర్లు దాటి బిహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి వచ్చేసింది. ప్రియుడు ఒక చిన్న గుడిసెలో పేదరికంలో బతుకుతున్నాడని తెలిసినప్పటికీ.. “నాకు అతడి ప్రేమే ముఖ్యం, ఆ గుడిసెలోనే ఉంటా” అంటూ తేల్చిచెప్పిన రష్యన్ యువతి ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రష్యాలో మొదలైన ప్రేమాయణం..

బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన రాహుల్ యాదవ్ అనే యువకుడు జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం రష్యా వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటున్న సమయంలో అతనికి స్థానిక రష్యన్ యువతి జూలీతో పరిచయం ఏర్పడింది.

స్నేహం కాస్తా ప్రేమగా మారి..
ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది. భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు.
ప్రియుడి కోసం 6 నెలల తర్వాత ఇండియాకు రాక..
 కొన్ని కారణాల వల్ల రాహుల్ రష్యా నుంచి బిహార్‌లోని తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఫోన్లలో, వీడియో కాల్స్‌లో రోజూ మాట్లాడుకుంటూ తమ బంధాన్ని కొనసాగించారు.
అతను లేకుండా ఉండలేనని..
రాహుల్ దూరమై ఆరు నెలలు కావస్తున్నా అతడి జ్ఞాపకాలను మర్చిపోలేకపోయిన జూలీ.. ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన తల్లిదండ్రులను ఒప్పించి, కుటుంబ సమేతంగా రష్యా నుంచి నేరుగా భాగల్‌పూర్‌లోని రాహుల్ ఇంటికి చేరుకుంది. విదేశీ యువతి తమ గ్రామానికి రావడంతో స్థానిక గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యంతో ఆమెను చూసేందుకు తరలివచ్చారు.
గుడిసెలోనే ఉంటా.. పెద్దల సమక్షంలో నవంబర్‌లో పెళ్లి
వివాహం తర్వాత ఎక్కడ ఉండాలనే విషయంపై రాహుల్ జూలీతో మాట్లాడాడు. తాను అత్యంత నిరుపేదనని, తన కుటుంబం ఒక చిన్న పూరి గుడిసెలోనే నివసిస్తోందని రాహుల్ స్పష్టంగా వివరించాడు. దానికి ఏమాత్రం వెనుకాడని జూలీ.. తనకు ఎలాంటి విలాసవంతమైన భవనాలు అవసరం లేదని, రాహుల్‌తో కలిసి అదే గుడిసెలో సాధారణ జీవితం గడపడానికి తనకు పూర్తి సమ్మతమేనని తెగేసి చెప్పింది.
జూలీ నిజమైన ప్రేమను చూసి ముగ్ధులైన ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇరువైపులా అంగీకారం కుదరడంతో వచ్చే నవంబర్ నెలలో హిందూ సంప్రదాయాల ప్రకారం రాహుల్, జూలీల వివాహం జరిపించాలని నిశ్చయించారు. హద్దులు దాటి వచ్చిన ఈ స్వచ్ఛమైన ప్రేమకథ స్థానికంగానే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. “నిజమైన ప్రేమకు ఎలాంటి అంతస్తులు అడ్డంకి కావని మరోసారి నిరూపించారు” అంటూ నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *