Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం గురించి కీలక ప్రకటన చేశారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా పథకం కింద, వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే నిధులు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్ల భూములకు ఈ పథకం వర్తించదని స్పష్టంగా తెలిపారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి సంవత్సరం ఎకరాకు ₹12,000 అందజేస్తారు. భూమి లేని రైతు కుటుంబాలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” కింద ఏడాదికి ₹12,000 ఆర్థిక సాయం అందజేస్తారు. వ్యవసాయ భూములు కలిగి ఉన్న రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అమలు చేస్తారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. గతంలో ధరణి లోపాల కారణంగా రైతుబంధు అందుకున్న వారు స్వయంగా ముందుకు వచ్చి వివరాలు అందించాలని సూచించారు. 2025లో ఈ సమావేశం తమ తొలి మీడియా సమావేశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జనవరి 26 నుంచి అన్ని పథకాలను అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.