Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అనంతరం చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారని కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇటీవల తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
అయితే, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే రామచంద్రరావును పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కానీ, రామచంద్రరావు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యుల బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ తీసుకోలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు కమలం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రామచంద్రారావుకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రామచంద్రరావు.. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన శనివారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.