Ram gopal varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన చెక్ బౌన్స్కేసులో కోర్టు తీర్పు వెల్లడిస్తూ, వర్మకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల నష్టపరిహారం మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని చెల్లించనట్లయితే, వర్మకు మరొక మూడు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.
కోర్టు వాదనలు గత ఏడేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో కోర్టు ఆగ్రహంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, ఈరోజు తీర్పును వెల్లడించింది.
ఇకపోతే, రామ్ గోపాల్ వర్మ తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన సూపర్ హిట్ చిత్రం ‘సత్య’ రీ-రిలీజ్ సందర్భంగా వర్మ భావోద్వేగంతో స్పందించారు. తాను ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసినట్టు నమ్మలేకపోతున్నానని, మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలు చేసినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇకపై మంచి సినిమాలనే తీర్చిదిద్దుతానని తెలిపారు.