Raghunandan Rao: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కఠినంగా స్పందించారు. మోదీ కులం గురించి మాట్లాడే ముందు, రేవంత్ రెడ్డి మొదట రాహుల్ గాంధీ కులం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన వారంతా చరిత్రలో కనుమరుగయ్యారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేసిన రఘునందన్ రావు, కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలని కొందరు చెబుతున్నారని, అలాంటి హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిదని నిలదీశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని తేల్చి చెప్పారు.
నరేంద్ర మోదీ కేబినెట్లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని, కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో మాత్రం ఇద్దరే బీసీలని గుర్తు చేశారు. ఏదైనా వ్యాఖ్య చేయే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోదీ కులం ఓసీ నుంచి బీసీగా మారిందని ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు.