Pvn madhav: భోగాపురం కూటమి ఘనత.. మేమే ముందుకు తీసుకెళ్లాం

Pvn madhav: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ విషయంలో వైసీపీ నేతలు తమకే ఘనత దక్కుతుందని ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదని, నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని మాధవ్ తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకం నెలకొందని, అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయని మాధవ్ విమర్శించారు. రాష్ట్ర సంపదను నాశనం చేసి, ఇప్పుడు తామే అన్నీ చేశామంటూ చెప్పుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. అయితే భోగాపురం ఎయిర్‌పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అందరూ స్వాగతించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై కూడా పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్ ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు, గతంలో ప్రారంభమైన పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

హంద్రీనీవా కాలువ పనులు పూర్తిచేసి కుప్పం వరకు నీటిని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేస్తామని ప్రకటించిన మాధవ్, ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *