Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే వైసీపీ శ్రేణులు బరితెగించి దాడులకు దిగాయి. నామినేషన్లు వేసేందుకు శాంతియుతంగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ వర్గాలు పక్కా వ్యూహంతో దాడికి తెగబడ్డాయి. వైసీపీ నాయకుల సమక్షంలోనే వైసీపీ మూకలు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డాయని, కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, మధు అనే టీడీపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెంగళూరు నుంచి కిరాయి రౌడీలను రప్పించి, పథకం ప్రకారం టీడీపీ శ్రేణులను టార్గెట్ చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లదాడిలో టీడీపీ నాయకులకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. గొడవ జరుగుతున్న సమయంలో ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వైసీపీ మూకలను ఆపడానికి ఎంత ప్రయతించిన వైసీపీ నేతలు గుండాలు, రెచ్చిపోతూనే ఉన్నారు. నామినేషన్ ప్రక్రియను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించిన ఎంపీ మిథున్ రెడ్డితో పాటు దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
