Breaking News: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పుంగనూరులో జరిగిన ఘర్షణల అనంతరం, తాజాగా రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నామినేషన్ల సందర్భంగా ఇరువర్గాలు ఎదురెదురు కావడంతో మొదలైన వివాదం క్షణాల్లో తీవ్రరూపం దాల్చింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
అంతకుముందు పుంగనూరులోనూ నామినేషన్ల దాఖలు కోసం ఇరు పార్టీల శ్రేణులు ఒకేసారి రావడంతో పెద్దఎత్తున రాళ్లదాడి జరిగింది. ఆ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమవడంతో పాటు మధు అనే కార్యకర్త తలకు బలమైన గాయమైంది. వరుసగా పుంగనూరు, రాయచోటిలలో దాడులు, వాహనాల దహనం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసులను మోహరించి బందోబస్తు పెంచారు.
