Prakasam: ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు “సాక్షి” టీవీ ఛానల్‌లో సీనియర్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ మరియు జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో కొంతమంది మహిళలు, టీడీపీ అనుచరులు, పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తక్షణమే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
దాడికి సంబంధించిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ కె. నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.