Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసులు ఆయనను ఇప్పట్లో వదిలేలేవు. పోసాని రాజంపేట జైలులో ఉండగానే పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు టూటౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో నర్సరావుపేటకు తరలించారు. నర్సరావుపేట టూటౌన్‌లో పోసానిపై వివిధ కేసులు నమోదవగా, ఈ రోజే ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 16కు పైగా కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై నర్సరావుపేట పోలీసులకు జనసేన నేతలు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బీఎన్ఎస్ యాక్ట్ 153-ఏ, 504, 67ఐటీ కింద ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
Posani Krishna Murali: ఇదిలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై పోసాని చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారంలో తొలుతు రాజంపేట పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటిలో అరెస్టు చేసి ఏపీకి తరలించారు. ఆయనకు రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఆయన కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ లోగానే నర్సరావుపేట పోలీసులు.. పోసానిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
Posani Krishna Murali: రాజంపేట జైలులో ఉండగానే, పోసానికి అనారోగ్యమంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఒట్టి డ్రామా అని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తేల్చారు. అనారోగ్యమంటూ ఆయన డ్రామా ఆడారని, ఆయన చెప్పిన అన్ని టెస్టులు చేయించామని, రాజంపేట ప్రభుత్వాసుపత్రితో పాటు రిమ్స్‌లో కూడా వైద్య పరీక్షలు చేయించామని, ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని సీఐ స్పష్టం చేశారు. దీంతో రాజంపేట సబ్‌జైలుకు తరలించామని తెలిపారు.