Mann Ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన 2026 నాటి తొలి “మన్ కీ బాత్” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. తీవ్రమైన కరువు, ఎర్రటి నేలలు, నీటితో సతమతమయ్యే అనంతపురం జిల్లాలో ప్రజలు చూపిన తెగువను ఆయన దేశానికి ఆదర్శంగా అభివర్ణించారు. నీటి కరవును ఎదుర్కోవడానికి కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా, స్థానికులు అధికారుల మద్దతుతో కలిసికట్టుగా జలాశయాలను పునరుద్ధరించుకోవడాన్ని మోదీ కొనియాడారు. ఈ సామూహిక కృషి వల్ల ఇప్పటికే 10కి పైగా జలాశయాలు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయని, ఏడు వేలకు పైగా మొక్కలను నాటడం ద్వారా ఆ ప్రాంతంలో పచ్చదనం పెరుగుతోందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.
జనవరి 26న దేశం జరుపుకోబోయే 77వ గణతంత్ర దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ, ఇది రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకునే గొప్ప రోజని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధమే అతి ముఖ్యమని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఒక గ్రామంలో యువత ఓటరుగా మారినప్పుడు ఆ విషయాన్ని వేడుకలా జరుపుకోవడం ద్వారా ఇతరుల్లో అవగాహన పెరుగుతుందని సూచించారు.
నదుల పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ గుండా ప్రవహించే తంసా నదికి స్థానికులు కొత్త ప్రాణం పోసిన తీరును ప్రధాని శ్లాఘించారు. అయోధ్యలో పుట్టిన ఈ నది ఒకప్పుడు కాలుష్యంతో నిండిపోయిందని, అయితే ప్రజలందరూ ఏకమై దాన్ని శుభ్రం చేసి ఒడ్డున చెట్లు నాటడం ద్వారా మళ్లీ జీవకళను తీసుకువచ్చారని చెప్పారు. “సమిష్టి కృషి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు” అనడానికి అనంతపురం జలాశయాలు, తంసా నది పునరుద్ధరణలే నిదర్శనమని ఆయన అన్నారు.
Also Read: Tejashwi Yadav: తనయుడికి పగ్గాలు అప్పగించిన లాలూ.. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఎదిగిందని మోదీ గర్వంగా ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతరిక్షం, సెమీకండక్టర్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అత్యాధునిక రంగాల్లో భారతీయ యువత తమ ఆవిష్కరణలతో చరిత్ర సృష్టిస్తున్నారని ప్రశంసించారు. అయితే, కేవలం కొత్త వస్తువులను తయారు చేయడమే కాకుండా, “నాణ్యత” (Quality) విషయంలో భారత్ ప్రపంచానికి ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులు ఏ లోపాలు లేని విధంగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని ఆయన పరిశ్రమలకు సూచించారు.
చివరగా, మన దేశ కుటుంబ వ్యవస్థపై ప్రధాని ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. భారతీయ కుటుంబ విలువలు ప్రపంచానికే ఆదర్శమని, విదేశీయులు సైతం మన అనుబంధాలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుని యూఏఈ ప్రభుత్వం 2026 సంవత్సరాన్ని ‘కుటుంబ సంవత్సరం’గా నిర్వహిస్తోందని వెల్లడించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
