Phone tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. గతంలో BRS పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ఇతర అధికారుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.
తాజాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ సంభాషనలపై కూడా గమనిక నమోదైంది. సిట్ దర్యాప్తులో బండి సంజయ్ ఫోన్‌తో పాటు ఆయన సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డట్లు ఆధారాలు లభించినట్టు సమాచారం. ఈ క్రమంలో, ఆయన వాంగ్మూలాన్ని స్వీకరించేందుకు సిట్ అధికారులు ఆయనను ఫోన్ ద్వారా సంప్రదించారు.
ఈ దశలో బండి సంజయ్ స్పందిస్తూ, తనకు 23వ తేదీ వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని, ఈలోపు ఎప్పుడైనా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికారుల అడిగిన సమయానికి విచారణకు వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలోనే మరికొంతమంది ప్రముఖులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.