Janasena: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఇటు తెలంగాణలో జనసేన పార్టీ పునర్నిర్మాణం, క్షేత్రస్థాయి విస్తరణపై పూర్తి దృష్టి సారించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో అందరికంటే ముందుగా తన మార్క్ వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు.
హైదరాబాద్ మణికొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్వయంగా ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ ప్రత్యేక ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తరఫున నియోజకవర్గమంతటా విస్తృతంగా పర్యటించేందుకు ఈ అత్యాధునిక ప్రచార వాహనాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, పలువురు సామాజిక వేత్తలతో పాటు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన పలువురు యువతీ యువకులు, క్రీడాకారులకు పవన్ కల్యాణ్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కేవలం ప్రచారానికే పరిమితం కావొద్దు.. పవన్ కల్యాణ్ పిలుపు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు..
యువత సమస్యలకు గొంతుక కావాలి..
ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ కేవలం ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు తిరిగే సాధారణ ప్రచార వాహనంగా మిగిలిపోకూడదు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రజాసేవ వేదికగా ప్రతి పల్లెకు, పట్టణానికి చేరుకోవాలి” అని దిశానిర్దేశం చేశారు.
ప్రజాపక్ష పోరాటమే అజెండా..
తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు, పెండింగ్ డీఏలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు.
డాక్టర్ గడల శ్రీనివాసరావు ఎంపిక – జనసేన ముందడుగు..
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా (DPH) పనిచేసి మంచి గుర్తింపు పొందిన డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన తమ అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యుడిగా, సామాజిక వేత్తగా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆయనకున్న పరిచయాలు, విద్యావంతులతో ఉన్న అనుబంధం ఎన్నికల్లో పార్టీకి కలిసివస్తుందని జనసేన నాయకత్వం భావిస్తోంది. నామినేషన్ల ఘట్టానికి ముందే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించేందుకే ఈ ‘గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను పవన్ పట్టాలెక్కించారు.
ఏపీలో దోస్తీ.. తెలంగాణలో ఏకాకి పోరాటమా?..
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీలతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జనసేన.. తెలంగాణలో కూడా ఎన్డీయే భాగస్వామిగా కొనసాగుతుందా లేదా అనేదానిపై నిత్యం చర్చ నడుస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ విభాగం ఇప్పటివరకు రెండు పట్టభద్రుల స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కమలం పార్టీలో ఇంకా వడపోతలు, కసరత్తులు సాగుతున్నాయి. బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడకుండానే జనసేనాని అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా, ప్రచార వాహనాన్ని సైతం రోడ్డెక్కించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
రామచందర్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తి..
ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. జనసేనతో పొత్తుల అంశాన్ని ఢిల్లీలోని తమ జాతీయ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ హైకమాండ్ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వకముందే జనసేన ఇలా సొంతంగా క్యాంపైన్ షురూ చేయడం వెనుక పవన్ కల్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని, పట్టభద్రుల నియోజకవర్గాల్లో జనసేన ఓటు బ్యాంక్ను నిర్ధారించుకోవడమే లక్ష్యంగా పవన్ ఈ దూకుడు ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రచారం తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాంటి పొలిటికల్ టర్నింగ్ పాయింట్స్ను తీసుకొస్తుందో వేచి చూడాలి.
