Pawan Kalyan

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పలమనేరు పర్యటనలో భాగంగా అడవి ఏనుగుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కీలకమైన కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ముసలిమడుగు ప్రాంతంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన నాలుగు కుంకీ ఏనుగుల ద్వారా, జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఏ విధంగా కట్టడి చేస్తారనే వివరాలను అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగుల విన్యాసాలను తిలకించి, కృష్ణ, అభిమన్యుడు అనే ఏనుగులకు స్వయంగా ఆహారం అందించారు.

‘హనుమాన్’ కార్యక్రమం ఆవిష్కరణ: నూతన అటవీ విధానానికి రూపకల్పన
కేంద్రం ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సహాయం కోసం రూపొందించిన నూతన కార్యక్రమం యొక్క పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం పేరు: హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్ (HANUMAN). ఈ ‘హనుమాన్’ కార్యక్రమంలో మొత్తం పదకొండు అంశాలను (11 Points) పొందుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు.

Also Read: Shree Charani: క్రికెటర్‌ చరణికి గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నజరానా!

అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ‘హనుమాన్’ కార్యక్రమం యొక్క లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో చేరుకునేలా అవసరమైన ప్రణాళికలను తక్షణమే రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమ అమలు తీరుపై సమీక్షించేందుకు ప్రత్యేకంగా నవంబర్ 18, 19 తేదీలలో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ, పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవనం శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా HANUMAN కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *