Pavan kalyan: వైసీపీ నేతల పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా అహంకారం తగ్గలేదు. ఇది ప్రభుత్వంపై జరిగిన దాడిగా చూస్తున్నాం. అహంకారంతో దాడులు చేస్తే, తోలు తీసి కూర్చోబెడతాం,” అని పవన్ హెచ్చరించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
దాడి ఘటనపై బాధితుడు మరియు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “నేను మీతో ఉన్నాను… ధైర్యంగా ఉండండి,” అంటూ వారికి భరోసా ఇచ్చారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు
మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడులు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని, ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని గుర్తుచేశారు. జవహర్ బాబుపై దాడి చేయడం దారుణమని, దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా అధికారులపై దాడులు చేశాడని అన్నారు.
జవహర్ బాబును చంపుతామని బెదిరించడాన్ని ఖండించిన పవన్, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం అనాగరికమని పేర్కొన్నారు.
పులివెందుల ఘటనపై విచారణ
పులివెందులలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఈ విషయంలో విచారణ జరుగుతోందని పవన్ తెలిపారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.