Party funds: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి కాసుల వర్షం కురుస్తుంది. హర్యానా, మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు బీజేపీకి మరో శుభవార్త వచ్చింది. బీజేపీకి విరాళాలు అందజేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో, ఈ పార్టీ ఫండ్స్ విషయంలో ఇతర పార్టీల కంటే ముందంజలో నిలుస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో, వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుండి రూ. 20,000కు మించి విరాళాల రూపంలో బీజేపీకి మొత్తం రూ. 2,244 కోట్లు అందాయి. ఇది 2022-23లో వచ్చిన విరాళాలకు మూడు రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 2023-24లో రూ. 288.9 కోట్లు విరాళాలు అందాయి. గతేడాది ఈ మొత్తం రూ. 79.9 కోట్లు మాత్రమే.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 2023-24 సంవత్సరానికి సంబంధించిన సహకార నివేదిక ప్రకారం, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ. 723.6 కోట్ల విరాళాలను అందించింది. అదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్‌కు రూ. 156.4 కోట్లు అందాయి. ఆసక్తికరంగా, బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో మూడో వంతు, కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం విరాళాల్లో సగానికి పైగా ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే వచ్చింది.
ఫిబ్రవరి 2024లో, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి, రాజకీయ పార్టీలు నేరుగా లేదా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నాయి, ఇవే ప్రధాన నిధుల మూలంగా మారాయి.