Dating App Safety

Dating App Safety: మహిళల భద్రత.. ఈ 5 గోల్డెన్ రూల్స్ పాటిస్తే అంతా సేఫ్!

Dating App Safety: భారతదేశంలో ఆన్‌లైన్ డేటింగ్ మార్కెట్ ఏటా 15 శాతానికి పైగా పెరుగుతుంది.  నగరాల్లోని అనేకమంది యువతీ యువకులు తీవ్రమైన, దీర్ఘకాలిక బంధాల( Long-term relationships)  కోసం డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సర్వేల ప్రకారం.. తెలియని వాళ్ళని నేరుగా కలవడం కంటే, డేటింగ్ యాప్‌లలో పరిచేయం పెంచుకొని తర్వాత నిర్ణయం తీసుకోని మాట్లాడటమే సురక్షితమని సగానికి పైగా భారతీయ మహిళలు భావిస్తున్నారు.

అయితే, డేటింగ్ యాప్స్‌ను ఉపయోగించేటప్పుడు మహిళలు ప్రొఫైల్ రూపొందించడం మొదలుకుని, మ్యాచ్‌లను పరిశీలించడం, ప్రత్యక్షంగా కలవడం వరకు అడుగడుగునా వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలు డేటింగ్ యాప్‌లను సురక్షితంగా ఉపయోగించడానికి నిపుణులు సూచిస్తున్న కీలక అంశాలు ఇవే..

ప్రొఫైల్ రూపొందించేటప్పుడు – అపరిచితులకు సులభమైన దారులు ఇవ్వకండి..

డేటింగ్ ప్రొఫైల్‌ను సోషల్ మీడియా ఖాతాలతో లింక్ చేసినప్పుడు లేదా ఫోటోలలో లొకేషన్ వివరాలు ఉన్నప్పుడు ఇతరులు మీ కార్యాలయం, నివాస ప్రాంతం, రోజూ ప్రయాణించే మార్గాలను సులభంగా తెలుసుకునే ప్రమాదం ఉంది.
  • పూర్తి పేర్లు, చిరునామాలు వద్దు: పూర్తి ఇంటిపేరు, పనిచేసే కంపెనీ పేరు, ఉండే కచ్చితమైన ఏరియా వివరాలను ప్రొఫైల్‌లో పెట్టవద్దు.
  • బ్యాక్‌గ్రౌండ్ వివరాలు పరిశీలించండి: మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలలో మీ అపార్ట్‌మెంట్ పేరు, కారు నంబర్ ప్లేట్, వీధి బోర్డులు కనిపించకుండా చూసుకోండి.
  • వ్యక్తిగత నంబర్ ఇవ్వడంలో తొందరపడొద్దు: తగినంత నమ్మకం ఏర్పడే వరకు వ్యక్తిగత మొబైల్ నంబర్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ఐడీలను షేర్ చేయకూడదు.

అత్యాధునిక ఫేక్ ప్రొఫైల్స్ – గుర్తించడం ఎలా?..

ప్రస్తుతం డాక్టర్లు, ఎన్‌ఆర్‌ఐలు లేదా విదేశీ ప్రాజెక్టుల్లో పనిచేసే ఇంజనీర్లుగా చెప్పుకుంటూ ఆకర్షణీయమైన ఫేక్ ప్రొఫైల్స్‌ను తయారు చేసి మోసాలకు పాల్పడే ముఠాలు పెరిగాయి.
  • అతిగా పొగడటం & ఎమోషనల్ ట్రాప్: పరిచయమైన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ప్రేమ, అభిమానం కురిపించడం, భావోద్వేగంగా దగ్గరవ్వడం.
  • ఆర్థిక అత్యవసరాలు: ఏదో ఒక ఆర్థిక సమస్యను సృష్టించి అర్జెంట్‌గా డబ్బులు అడగడం.
  • వీడియో కాల్ పరీక్ష: ప్రారంభంలోనే ఒకసారి రియల్-టైమ్ వీడియో కాల్ మాట్లాడటం మంచిది. నిజమైన వ్యక్తి అయితే తప్పించుకోరు. అలాగే ప్రొఫైల్ ఫోటోలను ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ (Reverse Image Search) చేయడం ద్వారా అవి నకిలీవా కాదా అని తెలుసుకోవచ్చు.

మహిళలు పాటించాల్సిన 5 భద్రతా సూత్రాలు (5 Golden Rules)..

  1. భద్రతా ఫీచర్లు ఉన్న యాప్‌లనే ఎంచుకోండి: మహిళలే ముందుగా సంభాషణ ప్రారంభించే ఫీచర్ (Women-message-first), అసభ్యకర ఫోటోలను ఆటోమేటిక్‌గా బ్లర్ చేసే సాంకేతికత, ఆధార్ లేదా సెల్ఫీలతో కూడిన రియల్-టైమ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉన్న యాప్‌లకే ప్రాధాన్యత ఇవ్వండి.
  2. యాప్ అల్గారిథమ్ ట్రాప్‌లో పడకండి: మీరు ఎక్కువ సమయం స్క్రోల్ చేసేలా యాప్‌లు డిజైన్ చేయబడి ఉంటాయి. కాబట్టి రోజువారీ సమయ పరిమితి (Time Limit) పెట్టుకుని వాడండి.
  3. రెడ్ ఫ్లాగ్స్‌ను గమనించండి: అసౌకర్యంగా అనిపించే మెసేజ్‌లు వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే బ్లాక్ లేదా రిపోర్ట్ చేయండి. అన్‌మ్యాచ్ చేసిన తర్వాత కూడా వేరే ప్లాట్‌ఫామ్‌లలో సంప్రదించడానికి ప్రయత్నిస్తే అప్రమత్తంగా ఉండండి.
  4. తొలి భేటీకి పక్కా ప్లాన్: మొదటిసారి కలిసేటప్పుడు ఎల్లప్పుడూ రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశాలనే (కేఫ్, రెస్టారెంట్) ఎంచుకోండి. అక్కడికి వెళ్లడానికి, తిరిగి రావడానికి సొంత వాహనాలు లేదా వ్యక్తిగత రవాణా ఏర్పాట్లు చేసుకోండి.
  5. సన్నిహితులకు సమాచారం: మీరు ఎవరిని కలుస్తున్నారు, ఏ ప్రదేశంలో, ఏ సమయంలో కలుస్తున్నారో ఆ వివరాలు, వారి ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌ను నమ్మకమైన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు పంపించి లైవ్ లొకేషన్ షేర్ చేయండి.

ఏ క్షణంలోనైనా ఏదైనా అసౌకర్యంగా లేదా ప్రమాదకరంగా అనిపిస్తే.. ఎలాంటి సంకోచం లేకుండా అక్కడి నుంచి తక్షణమే బయటకు వచ్చేయడమే సరైన నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *