Supreme Court: దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఒకే ఒక్క నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో పోలీసులకు ‘100’, అగ్నిమాపక సిబ్బందికి ‘101’, అంబులెన్స్ కోసం ‘102’, ‘108’ వంటి వేర్వేరు నంబర్లు వాడుతున్నారు. అయితే ఏదైనా ప్రమాదం లేదా వైద్య అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ఏ నంబర్‌కు ఫోన్ చేయాలో తెలియక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఇబ్బందులను దూరం చేస్తూ, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ‘112’ నంబర్‌ను మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రోడ్డు భద్రత కోసం పనిచేసే ‘సేవ్‌లైఫ్ ఫౌండేషన్’ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రకర్ల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా తీవ్రమైన గాయాలైనప్పుడు బాధితులు తీవ్రమైన షాక్‌లో ఉంటారని కోర్టు పేర్కొంది. అలాంటి సమయంలో ప్రతి సెకనూ ఎంతో విలువైనదని, సకాలంలో సహాయం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమయంలో స్పందించి సహాయం అందించడమే ప్రాణాలను కాపాడే నిజమైన మందు అని, ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుతో ముడిపడి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కొత్త విధానాన్ని రాబోయే మూడు నెలల్లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఈ పనులు ఎంతవరకు వచ్చాయో చూసేందుకు ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లలో పెట్టాలని పేర్కొంది. దీనితో పాటు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ అంబులెన్సులన్నింటినీ జాతీయ భద్రతా ప్రమాణాల (AIS-125) ప్రకారం ఆధునీకరించాలని స్పష్టం చేసింది. ప్రతి అంబులెన్స్‌కు తప్పనిసరిగా జీపీఎస్ (GPS), వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి, వాటిని నేరుగా ‘112’ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీనివల్ల ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ ఎక్కడుందో సులువుగా గుర్తించి, వేగంగా ఘటనా స్థలానికి చేరుకునే వీలుంటుంది.
ఇకపై ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ‘మెడికల్ రెస్క్యూ ప్రోటోకాల్’ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. అలాగే, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడటానికి ముందుకు వచ్చే వారు పోలీసు విచారణలు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోననే భయంతో వెనకడుగు వేస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ భయాలను పోగొట్టి, సహాయం చేసేవారికి రక్షణ కల్పించే వాతావరణం రావాలని అభిప్రాయపడింది. దేశమంతటా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’ అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
