Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనితో తిరుమల కొండపై ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో కూడా భక్తులు ఓపికగా వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.

మరోవైపు, నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 45,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, తమ భక్తిని చాటుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4.15 కోట్లుగా నమోదైందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు క్యూలైన్లలో ఓపికతో వ్యవహరించాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *