Mana Desam: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది. నభూతో నభవిష్యతిగా సాగిన నటరత్న నటనావైభవాన్ని తలచుకున్న కొద్దీ జనం మరింతగా పులకించి పోతారు. అంతటి మహానటుడు తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘మనదేశం’. 1949 నవంబర్ 24న ఈ సినిమా విడుదలయింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నటి కృష్ణవేణి నిర్మించి, నటించిన ఈ చిత్రంలో నాగయ్య, నారాయణరావు కీలక పాత్రలు ధరించారు. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో రామారావు కనిపించారు. సినిమాలో యన్టీఆర్ కనిపించేది నాలుగు సీన్స్ లోనే అయినా ప్రేక్షకుని మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. ఆ తరువాత ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లోనే ‘షావుకారు’లో హీరోగా నటించారు యన్టీఆర్. ఆ పై మరి వెనుతిరిగి చూసుకోకుండా రామారావు నటపస్థానం సాగింది. తెలుగు చిత్రసీమలో 100 చిత్రాలు, 200 సినిమాలు, 300 మూవీస్ చూసిన తొలి నటునిగా చరిత్రలో నిలచిపోయారు రామారావు. అనితరసాధ్యంగా సాగిన రామారావు నటజీవితానికి బీజం వేసిన చిత్రంగా ‘మనదేశం’ 75 ఏళ్ళుగా అభిమానుల మనసుల్లో నిలచే ఉంది.