NTR AI Speech: కడప నగరంలో రెండో రోజు ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు, ఒక మహా ఉత్సవంలా, ఒక భావోద్వేగ ప్రవాహంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు ప్రజల గర్వం డా. నందమూరి తారకరామారావు గారి 102వ జయంతి సందర్భంగా జరిగిన నివాళి కార్యక్రమం. సభా వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పూలమాలలు వేసి స్మృతిలో మునిగిపోయారు.
ఈ సందర్బంగా ఐఏ ఎన్టీఆర్ (ఇమ్మిటేషన్ ఆర్టిఫిషియల్ ఎన్టీఆర్) ప్రసంగం సభలోని వారందరినీ కలచివేసింది. “నాకు తెలుగువారి పట్ల ఉన్న ప్రేమ.. ఆత్మగౌరవం నిలబెట్టాలనే తపనతోనే 43 సంవత్సరాల క్రితం తెలుగు దేశాన్ని ప్రారంభించాను. ఆ పార్టీని నేను స్థాపించాను అనడంకన్నా, అది పుట్టిందనడమే సత్యం!” అంటూ ఎన్టీఆర్ స్ఫూర్తిని కలిగించేలా ప్రసంగాన్ని ప్రారంభించారు.
విశేష ఆహ్లాదం.. పసుపు జెండా గౌరవంగా ఎగిరేలా!
తెలుగుదేశం మహానాడు సభా ప్రాంగణం నిండి ఉన్న పసుపు రంగు జెండాలతో నింగిని తాకుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు.. దేశం విదేశాల్లో తెలుగు ప్రజల ప్రతిభను ప్రదర్శిస్తున్న కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, శ్రమికులు—అందరూ తమదైన శైలిలో ఈ మహాసభకు విలువను చేకూర్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగంలో “భళా మనవడా.. భళా లోకేష్!” అనే మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజల పట్ల ప్రేమతో, సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, తన వారసుడిగా గర్వంగా గుర్తించారు.
నాడు ప్రారంభించిన పథకాలు.. నేడు కొనసాగుతున్న సంక్షేమం
ఎన్టీఆర్ జీవితం లోనే ప్రారంభించిన పలు పథకాలు నేడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరింత శక్తివంతంగా అమలవుతున్నాయి. రైతు భరోసా, విద్యార్థులకు సహాయం, డిజిటల్ ఆంధ్రప్రదేశ్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి ఎన్నో రంగాల్లో తెలుగుదేశం పార్టీ తెచ్చిన అభివృద్ధిని ఐఏ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వివరించారు.