CM Adityanath: ఉత్తరప్రదేశ్‌లోని జేవర్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) కీలక ఆమోదం తెలిపింది. ఇకపై ఈ మెగా విమానాశ్రయాన్ని అధికారికంగా ‘నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడా-జేవర్’ (Narendra Modi International Airport, Noida-Jewar) గా పిలవనున్నారు.
లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు అద్భుతమైన ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని బహుమతిగా అందించినందుకుగాను ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రిమండలి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిందని పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద ఏవియేషన్ హబ్ – జేవర్ ప్రత్యేకతలు..
జేవర్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలవడమే కాకుండా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ (NCR) రీజియన్‌లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత సేవలందించే రెండో అతిపెద్ద అంతర్జాతీయ కేంద్రంగా రికార్డు సృష్టించింది.ఈ విమానాశ్రయాన్ని 2026 మార్చిలో ప్రారంభించగా.. జూన్ 15న లక్నో నుంచి వచ్చిన ఇండిగో (IndiGo) విమానం ఇక్కడ తొలిసారి అధికారిక ల్యాండింగ్ చేసింది.
రెండు వైపులా ఐఎల్ఎస్ (ILS)..
ప్రయాణికుల భద్రత, ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ కోసం రన్‌వేకు రెండు చివర్లలోనూ ‘ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్’ (ILS) ఏర్పాటు చేశారు. వాతావరణం అనుకూలించకపోయినా, గాలి దిశ ఎలా ఉన్నా విమానాలు ఇరువైపుల నుంచి సురక్షితంగా దిగే వెసులుబాటు ఇక్కడ ఉంది.
రూ.60,000 కోట్ల మౌలిక వసతులు – ప్రధాని మోదీ విజన్: సీఎం యోగి
యూపీలో మౌలిక వసతుల కల్పనలో వచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం యోగి ఈ సందర్భంగా వివరించారు.. ప్రధాని మోదీ ఆలోచనలతో రాష్ట్రంలో దాదాపు రూ.60,000 కోట్ల వ్యయంతో 2,483 కిలోమీటర్ల మేర 42 జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-మీరట్, కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలతో యూపీ కనెక్టివిటీ సరికొత్త స్థాయికి చేరిందన్నారు.
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరగడం, ఆలయంపై ధార్మిక పతాకం ఎగరడం జాతికే గర్వకారణమని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్, గంగా పథ్, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా, పిపర్వా బౌద్ధ ప్రాంతాల పునరుద్ధరణ, కాశీ తమిళ సంగమం, సంత్ గురు రవిదాస్ మ్యూజియం, వాజ్‌పేయి ప్రేరణా స్థల్ నిర్మాణం, మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం వంటి నిర్ణయాలు ప్రధాని మోదీ నాయకత్వానికే నిదర్శనమన్నారు.
నోయిడా-జేవర్ విమానాశ్రయం పూర్తిస్థాయి విస్తరణ పూర్తయితే దేశంలోనే అతిపెద్ద విమాన ప్రయాణాలు, కార్గో సరుకు రవాణా హబ్‌గా రూపాంతరం చెందనుంది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ పేరు మార్పు ప్రతిపాదన త్వరలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ వద్దకు అధికారిక లాంఛనాల కోసం వెళ్లనుంది.
