Nimmala ramanaidu: రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడం లక్ష్యంగా ఎన్టీఆర్ రోజులనుండి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో జలవనరులకు సంబంధించి చేపట్టిన తీర్మాన సందర్భంగా ఆయన మాట్లాడారు.
నీరు పంచభూతాలలో ఒకటి. దాని ప్రాముఖ్యతను తెలుగుదేశం పార్టీ స్థాపన దశలోనే గుర్తించిందని మంత్రి చెప్పారు. “జలవనరులు ఉన్నచోటే నాగరికతలు వికసిస్తాయనే చారిత్రక సత్యాన్ని మన నేతలు అప్పుడే అర్థం చేసుకున్నారు,” అని అన్నారు.
రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నిమ్మల పేర్కొన్నారు. “2014-2019 మధ్య మన ప్రభుత్వం పోలవరం పనులలో 72 శాతం పూర్తిచేసింది. అయితే, తర్వాత వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి, ప్రాజెక్టు దారుణంగా ఆలస్యం అయ్యింది,” అని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక ప్రకారం 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. గోదావరిలో వృథా పోతున్న నీటిని రాయలసీమకు తరలించి “రత్నాల సీమ”గా మార్చాలన్నది టీడీపీ సంకల్పమని చెప్పారు.
ఈ లక్ష్యం కోసం రూ. 80 వేల కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపొందించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే:
72 లక్షల మందికి తాగునీరు
7.2 లక్షల ఎకరాలకు సాగునీరు
22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
సాధ్యమవుతుందని నిమ్మల వివరించారు.
అలాగే, పోలవరం ఎడమ కాలువపూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతం సుజల స్రవంతిగా మారుతుందన్నారు. విశాఖపట్నం నగరానికి తాగునీరు, ఉక్కు పరిశ్రమ సహా అనేక పారిశ్రామిక అవసరాలకు సమృద్ధిగా నీరు అందించగలమన్నారు.
