Road Accident: నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం అక్కడి క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. జాతీయ క్రీడా పోటీలను ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యువ క్రీడాకారులతో పాటు, సీనియర్ జర్నలిస్టు, వైద్య సిబ్బంది, పీఆర్ అధికారులు, క్రీడా నిర్వాహకులు ఉన్నారు.
ప్రమాదం శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి కానో నగరానికి వెళ్లుతున్న కోస్టల్ బస్సు దకాసోయే పట్టణం సమీపంలోని ఓ వంతెనపై అదుపు తప్పి కింద పడిపోయింది. సమాచారం మేరకు బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. వీరిలో 21 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని కురా జనరల్ హాస్పిటల్, ముర్తాలా మొహమ్మద్ స్పెషలిస్ట్స్ హాస్పిటల్ లాంటి సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో రాత్రంతా ప్రయాణం చేసిన డ్రైవర్ అలసటకు లోనై ఉండొచ్చని, అలాగే వాహన వేగం అధికంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక సీనియర్ క్రీడా జర్నలిస్టు ఆడో సలిసు తెలిపారు. అధికారికంగా ప్రమాదానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రాథమికంగా రహదారి దుస్థితి, వంతెన నిర్మాణంలో లోపాలు, డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలపై దృష్టి సారించారు.
ఈ ఘటనపై నైజీరియా క్రీడా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “క్రీడాకారుల భద్రతపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. ఇకపై అంతరాష్ట్ర ప్రయాణాల్లో అవసరమైన భద్రతా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది” అంటూ పలువురు క్రీడా ప్రముఖులు, మాజీ క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు.
మృతుల కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. “వారి మృత్యువు క్రీడా రంగానికి తీరని లోటు” అంటూ దేశవ్యాప్తంగా నివాళుల జల్లు కురుస్తోంది. వారి కృషి, త్యాగాలు నైజీరియా క్రీడల అభివృద్ధిలో చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
గత ఏడాది 2024లో నైజీరియాలో 9,500కి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 5,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటన మరోసారి రహదారి భద్రతపై ప్రభుత్వ అలసత్వాన్ని చూపిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తిస్తున్నాయి.