Hyderabad: హైదరాబాద్‌లో నేపాలి దొంగల ముఠా మరోసారి కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్న ‘హిల్ రిడ్జ్ విల్లాస్’లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో నమ్మకంగా పనికి కుదిరిన నేపాల్ దంపతులే ఈ ఘోరానికి ఒడిగట్టారు. కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాలు, నగదుతో వారు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్‌లో ప్రకాష్ అనే ప్రముఖ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో పనుల కోసం నెల రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన కమల్, విమల అనే దంపతులను చేర్చుకున్నారు. అయితే, వ్యాపార పనిమీద ప్రకాష్ కొన్ని రోజుల క్రితం ముంబైకి వెళ్లారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్లడంతో ఇల్లు ఖాళీగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నేపాలి దంపతులు ఇంట్లో ఉన్న ల్యాకర్లను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
సోమవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చేసరికి పనిమనుషులు ఇద్దరూ కనిపించలేదు. లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో రెండు చోట్ల దాచి ఉంచిన బంగారు నగలు, వెండి వస్తువులు, ఖరీదైన వజ్రాభరణాలు, నగదు మాయమయ్యాయి. చివరకు పూజా గదిలోని దేవుడి విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసును కూడా దొంగలు వదల్లేదు. దీంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఇంట్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి ఏకంగా 6 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితులు దేశం దాటిపోకుండా ఉండేందుకు నాలుగు బృందాలను ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. అలాగే ఈ దంపతులను పనిలో చేర్పించిన ఏజెంట్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగతనానికి గురైన మొత్తం సొత్తు విలువపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు.
