ACB Raids: రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) మోహన్ నాయక్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఆయన తన సంపాదనకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో ఈ సోదాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నాయి.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా నంబర్-98లో మోహన్ నాయక్ నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం నుంచే ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు ఈ విల్లాలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారుల అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు.
మోహన్ నాయక్ ఈఎన్‌సీగా పనిచేసిన కాలంలో వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకుని అక్రమంగా టెండర్లు కేటాయించారనే ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో కొన్ని కీలకమైన ఆస్తి పత్రాలు, భారీగా నగదు, బంగారు నగలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాతే ఎంత ఆస్తి దొరికింది, దాని విలువ ఎంత అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.
