Stole Earrings: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. బురదలో కూరుకుపోయిన వారిని, మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తుంటే.. కొందరు మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించిన దారుణ ఘటన నేపాల్‌లో వెలుగుచూసింది.
వీడియో వైరల్ – ఇద్దరు నిందితుల అరెస్ట్..
చిత్వాన్ జిల్లా పరిధిలోని నారాయణి నదిలో కొట్టుకువచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు కర్రలు, జుట్టు పట్టుకుని ఒడ్డుకు లాగారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న బంగారు దిద్దులను తీసి జేబులో వేసుకున్నారు. చుట్టూ ఉన్నవారు వారిని అడ్డుకోకుండా వీడియోలు తీశారు.
ఈ 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేపాల్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితులను మదన్ గురుంగ్ (25), ఉమేష్ చౌదరి (38)గా గుర్తించి భరత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ సమీపంలో అరెస్ట్ చేశారు.
విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని చోరీలు, అమానవీయ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నేపాల్ పోలీసులు హెచ్చరించారు.
469కి చేరిన మరణాలు – కొనసాగుతున్న గాలింపు..
ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అధికారికంగా 469కి పెరిగింది. దాదాపు 1,400 నుంచి 1,500 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వీరిలో 290 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 50 మంది విదేశీయులు సహా 796 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. టిబెట్ సరిహద్దులోని గైరోంగ్ ల్యాండ్ పోర్ట్ వద్ద బహుళ అంతస్తుల భవనం, బస్ పార్కింగ్ ప్రాంతాలు 5 అడుగుల లోతు బురదలో కూరుకుపోయాయి.
మీడియా కవరేజీపై చైనా ఆంక్షలు..
నేపాల్-టిబెట్ సరిహద్దులో వరద విధ్వంసానికి సంబంధించిన సమాచారం, దృశ్యాలపై చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియా వేదికల నుంచి విమర్శనాత్మక వీడియోలను తొలగిస్తూ, కేవలం ప్రభుత్వ అధికారిక సహాయక చర్యల సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేసేలా నియంత్రిస్తోంది.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
