Konda Surekha

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డి కి  రాఖీ కట్టిన కొండా సురేఖ  

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన పరకాల వివాదం అనంతరం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై క్రమశిక్షణా కమిటీ నోటీసుల తర్వాత కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, సీఎంతో భేటీ ముగిసిన తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియాతో ఎలాంటి మాట్లాడకుండానే మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పరకాల వేదికగా మొదలైన అసలు వివాదం..

ములుగు, పరకాల పర్యటనల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరకాల టికెట్‌ను ఆశిస్తున్న కొండా కుటుంబం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరుసటి రోజే గీసుకొండలో సభ పెట్టిన సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.
నేరుగా సీఎంపైనే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. కుమార్తె వ్యాఖ్యలకు తానేమీ బాధ్యురాలిని కాదని సురేఖ వివరణ ఇచ్చారు.

ఏఐసీసీ కోర్టులో బంతి – వేటు తప్పదా?:

మరోవైపు, కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ అధిష్ఠానం స్థాయికి చేరింది:
  1. నివేదిక సమర్పించిన క్రమశిక్షణా కమిటీ: సురేఖ సమాధానంపై సంతృప్తి చెందని పీసీసీ క్రమశిక్షణా కమిటీ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ పూర్తి నివేదికను ఏఐసీసీకి పంపించింది.
  2. మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క భేటీలు: ఈ వ్యవహారం పూర్తిగా ఏఐసీసీ పరిధిలోనే ఉందని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
  3. భవిష్యత్ పరిణామాలు: కేబినెట్ నుంచి సురేఖను ఇప్పుడే తప్పించాలా? లేక మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ వరకు వేచి చూడాలా? అనేదానిపై హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది.

ఒకవైపు పార్టీ పరంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుండగా.. రక్షాబంధన్ వేళ సురేఖ స్వయంగా సీఎంకు రాఖీ కట్టడం వెనుక డ్యామేజ్ కంట్రోల్ వ్యూహం ఉందా లేదా అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *