Crime News: అమ్మ ఎందుకు చనిపోతుందో తెలియదు, తనపైనా ఎందుకు పెట్రోల్ పోసి అంటించిందో తెలియదు.. అసలు ఎవరిమీద కోపంతో ఇలా చేసిందో కూడా తెలియకుండానే ఓ చిన్న పిల్లాడు చనిపోయాడు. ఈ దారుణ ఘటన వెంకటగిరి మండలంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నాగేశ్వరశర్మ అనే వ్యక్తి వెంకటగిరి పట్టణంలోని ఆత్మామాలిక్ ధ్యాన మందిరంలో పండితుడిగా పని చేస్తున్నారు. నాగేశ్వరశర్మ, లీలాబాలశ్రావణి (35) దంపతులకి కుమారుడు చంద్రమౌళి (9), ఓ కుమార్తె (7) ఉన్నారు.
సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లీలాబాలశ్రావణి తన కుమారుడిని బండిపైన ఎక్కించుకొని కాశీతోటలోని శివాలయం వద్దకు తీసుకువెళ్లింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆమె తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ను ముందుగా కుమారుడిపైన పోసి, ఆ తర్వాత తనపైనా పోసుకొని నిప్పంటించుకుంది. ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది కాబట్టి ఆ నొప్పిని భరిస్తూ అక్కడే కాలిపోయి చనిపోయింది. కానీ పిల్లాడికి అలా కాదు.. శరీరం కాలుతుంటే ఆ నొప్పి భరించలేక పెద్దపెద్దగా కేకలు వేస్తూ తుప్పల్లో పరుగులు తీయడం మొదలు పెట్టాడు. కొంత దూరం వెళ్లగానే అటు వైపు వస్తున్న ఓ ఆటో డ్రైవర్ కంట పడ్డాడు. దీంతో ఆయన ఆరా తీయగా, పిల్లాడు తండ్రి ఫోన్ నెంబర్ ఇచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. నాగేశ్వరశర్మ అక్కడికి వచ్చేసరికే భార్య చనిపోవడంతో, చేసేదేమీ లేక తీవ్రంగా గాయపడిన కుమారుడిని తీసుకొని తిరుపతి ఆసుపత్రికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
లీలాబాలశ్రావణి ఇల్లు వదిలి కుమారుడిని తీసుకొని వెళ్లిన సమయంలో కూతురు ఆడుకోవడానికి బయటికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడిందని చుట్టుపక్కల జనాలు అనుకుంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలియడంతో సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అసలు ఆమె ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
