Mohammed Siraj: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును విడుదల చేసిన బీసీసీఐ పై ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ను జట్టు నుండి అనూహ్యంగా తొలగించడం పై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన సిరీస్ లలో బుమ్రా తర్వాత మంచి ప్రతిభ కనబర్చిన మహ్మద్ సిరాజ్ పై మేనేజ్మెంట్ మరియు సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవడం పలువురికి నప్పలేదు.
భారత్ గత మూడు సంవత్సరాలలో ఆడిన వన్డే మ్యాచ్ లలో సిరాజ్ 71 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే వన్డే క్రికెట్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించిన చివరి భారతీయ పేసర్ సిరాజ్ కావడం గమనార్హం. సిరాజ్ ఆడిన చివరి 17 వన్డేలలో కూడా కేవలం రెండుసార్లు మాత్రమే అతను మ్యాచ్ కు ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక సిరాజ్ తొలగింపు పై రోహిత్ శర్మ స్పందిస్తూ కొత్తబంతితో సిరాజ్ బాగా రాణిస్తున్నాడని అయితే పాత బంతితో అతని ప్రదర్శన అవసరమైన మేరకు లేదని విశ్లేషించడం కొసమెరుపు.
ఇది కూడా చదవండి: Kho Kho World Cup 2025: ఖోఖో మొదటి ప్రపంచ కప్ మనదే!
రోహిత్ శర్మ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కు సంబంధించి సిరాజ్ కొత్త బంతితో అంతగా రాణిస్తాడు అన్న పక్షంలో 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో మాత్రం రోహిత్ శర్మ బుమ్రా తో జట్టుగా షమీకు కొత్త బంతి బాధ్యత ఎలా ఇచ్చాడన్నది పలువురు ప్రశ్న. టోర్నమెంట్ మొత్తం బుమ్రాతో కొత్త బంతిని పంచుకున్న సిరాజ్ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్ లో మాత్రం 19వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చాడు. ఆ మ్యాచ్ భారత జట్టు ఓటమి పాలయి ప్రపంచకప్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక రోహిత్ శర్మ ద్వంద్వ వైఖరి పై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ ముఖ్యంగా షమీ గాయం నుండి ఇప్పుడిప్పుడే కోరుకునే జట్టులకు వచ్చాడు అతడు ఫిట్ నెస్ పైన పూర్తిస్థాయి నమ్మకం రాకుండానే ఒక అనుభవం గల ప్రతిభావంత బౌలర్ ను జట్టు నుండి తొలగించడం ఎంతోమందికి మింగుడుపడడం లేదు.
ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ మెగా టోర్నమెంట్ మార్చి 9న ముగుస్తుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మినహాయించి మిగిలిన టోర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ లో జరుగుతుంది. రాజకీయపరమైన ఇబ్బందులు భద్రత కారణాల దృష్ట్యా భారత జట్టు ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయిలో జరుగుతాయి. ఇక భారత్ ఫైనల్ కు వస్తే ఆ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. ఇందుకు బదులుగా భవిష్యత్తులో భారత్ లో జరిగే ఏ టోర్నమెంట్ కు అయినా ఇలాంటి న్యూట్రల్ వేదికను ఎంచుకునే వెసులపాటును ఐసీసీ… పాకిస్తాన్ కు కల్పించింది.