RTC Driver Shanakar Goud: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం నర్సంపేట నియోజకవర్గంలో కార్చిచ్చు రేపింది. మృతదేహానికి నివాళులర్పించే క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన తోపులాటతో ముత్తోజిపేట గ్రామం యుద్ధభూమిని తలపించింది. తమ సహోద్యోగిని కడసారి చూసుకునేందుకు డిపో వద్దకు తీసుకెళ్తామన్న కార్మికుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది.
డిపో వైపు శవయాత్ర.. అడ్డుకున్న పోలీసులు
శుక్రవారం ఉదయం శంకర్ గౌడ్ మృతదేహం ఆయన స్వగ్రామమైన ముత్తోజిపేటకు చేరుకుంది.
శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లి, అక్కడ కార్మికులందరి సమక్షంలో నివాళులర్పించాలని కుటుంబ సభ్యులు, కార్మికులు నిర్ణయించుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో గ్రామ శివారులోనే పోలీసులు భారీగా మోహరించి కార్మికులను అడ్డుకున్నారు.
రంగంలోకి పెద్ది సుదర్శన్ రెడ్డి – ఉద్రిక్తత
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి మృతదేహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. మాజీ ఎమ్మెల్యేను తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని కార్మికులు, మహిళలు అడ్డుకున్నారు. టైర్ల కింద పడుకుని నిరసన తెలపడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ముత్తోజిపేటలో భారీ భద్రత
ప్రస్తుతం ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కార్మికులు “శంకర్ గౌడ్ అమర్ రహే” అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
-
అదనపు బలగాల మోహరింపు: చుట్టుపక్కల మండలాల నుండి అదనపు పోలీసు బలగాలను నర్సంపేటకు రప్పించారు.
-
కార్మికుల ఆగ్రహం: ప్రభుత్వం స్పందించి హామీ ఇచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు.
