Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ జ్యూరిచ్‌లో ప్రవాసాంధ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని వివరించారు.
“మా బ్రాండ్ సీబీఎన్”
లోకేశ్ మాట్లాడుతూ, “పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు రావాలని అడిగితే, మా బ్రాండ్ సీబీఎన్ అని ఒకటే మాట చెబుతాను. చంద్రబాబు నాయుడుగారి పేరు వినగానే ప్రపంచంలోని ఏ కంపెనీ గేట్లు అయినా తెరుచుకుంటాయి. అది సీబీఎన్ సత్తా. చాలా మందికి తెలియదు కానీ చంద్రబాబు గారు ఒక పారిశ్రామికవేత్త. ఆయన నాలుగు కంపెనీలను స్థాపించి, మూడు ఫెయిలైన తర్వాత హెరిటేజ్ కంపెనీ ద్వారా విజయం సాధించారు” అని వివరించారు.
“చంద్రబాబు గారే ఉదాహరణ”
లోకేశ్ మాట్లాడుతూ, “చంద్రబాబు గారిని అరెస్టు చేసి జైలులో పెట్టినపుడు కూడా ఆయన ఎక్కడా అధైర్యపడలేదు. జీవితంలో ఆటుపోట్లు సహజం, కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడితే విజయం ఖాయం అని ఆయన నిరూపించారు. గత ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి 94 శాతం సీట్లు సాధించాం. గత ఐదేళ్లలో అమరావతి ఉద్యమం కొనసాగించి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశాం. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తేనికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం” అన్నారు.
నవీన కార్యక్రమాలు
పార్టీ కార్యాలయంలో “ఎంపవర్‌మెంట్ సెంటర్” ఏర్పాటు చేసి, యువతకు ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. “మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఓంక్యాప్‌ను ప్రక్షాళన చేశాను. చంద్రబాబు గారు ఓవర్‌సీస్ బ్లూ కాలర్ జాబ్స్ కోసం ఓంక్యాప్‌ను ప్రారంభించారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెంబర్ వన్‌గా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యం” అని అన్నారు.
“రాష్ట్ర పునర్నిర్మాణం”
లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించుతూ, “ఎన్నికల సమయంలో ప్రవాసాంధ్రులు సెలవులు తీసుకుని భారత్‌కు వచ్చి కూటమి విజయానికి పనిచేశారు. అదే స్పూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా పనిచేయాలి. మన కలలను నెరవేర్చేందుకు కలిసికట్టుగా పని చేసి, ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేద్దాం. రెడ్ బుక్ పనులు ప్రారంభమయ్యాయి. వాటిని పూర్తిచేయడం నా బాధ్యత” అని స్పష్టంచేశారు.