Naga Chaitanya

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!

Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ముంబైలో జరిగిన మొదటి ‘ఇండియన్ నేషనల్ సినిమా అకాడమీ’ (INCA) అవార్డుల వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ‘తండేల్’ సినిమాలో ఆయన కనబరిచిన అద్భుత నటనకు గానూ ఈ గౌరవం దక్కింది. ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డును కూడా గెలుచుకున్న చైతన్య, ఇప్పుడు జాతీయ స్థాయి వేడుకలో మరో అవార్డును తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘తండేల్’ చిత్రంలో నాగచైతన్య ‘తండేల్ రాజు’ అనే పాత్రలో జీవించారు. మత్స్యకారుల జీవనశైలిని, వారి కష్టాలను ప్రతిబింబించేలా ఆయన చేసిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం ఆయన నేర్చుకున్న శ్రీకాకుళం యాస, చూపించిన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ అవార్డు రావడం పట్ల అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “తండేల్ రాజు పాత్ర నాకు ఎంతో నేర్పింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కథను తెరపైకి తీసుకురావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా కెరీర్‌లో ఇదొక మర్చిపోలేని ప్రయాణం. ఈ సక్సెస్‌లో భాగమైన దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు మరియు సాయి పల్లవికి నా ధన్యవాదాలు. మీ అందరి సహకారం వల్లే నేను ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాను” అని ఎమోషనల్ అయ్యారు.

భారతదేశంలోని 12 భాషల సినీ పరిశ్రమల ప్రతిభను గుర్తించడానికి ఈ ‘ఇన్కా’ (INCA) అవార్డులను ప్రారంభించారు. మొదటి ఏడాదిలోనే నాగచైతన్య ఈ అవార్డు గెలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తండేల్’ సినిమా అందించిన విజయంతో చైతన్య ఇకపై కూడా బలమైన కథలు, వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి సందేశాత్మక చిత్రాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *