Amit Shah

Amit Shah:మాట్లాడం రాకపోతే.. సీనియర్ల నుండి నేర్చుకో.. రాహుల్ కి షా సలహా

Amit Shah: దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు పార్లమెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. తగినంత మెజారిటీ (2/3 వంతు) లభించకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

రాహుల్ విమర్శలు.. ఇది మనువాదాన్ని రుద్దడమే

చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లు మహిళల సంక్షేమం కోసం తెచ్చింది కాదని, బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు.

ఈ బిల్లు ద్వారా దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చి, రాజ్యాంగంపై మనువాదాన్ని రుద్దాలని మోదీ సర్కార్ చూస్తోంది. ఇది ఓబీసీలు, దళితులు మరియు మహిళలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది అని రాహుల్ మండిపడ్డారు. ఇది నిజమైన మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని ఆయన కొట్టిపారేశారు.

అమిత్ షా ధీటైన కౌంటర్.. ప్రియాంక దగ్గర నేర్చుకో 

రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ వాడిన భాషపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సభలో ఎలా మాట్లాడాలో, గౌరవాన్ని ఎలా కాపాడాలో రాహుల్ తన సీనియర్ల దగ్గర నేర్చుకోవాలి. మీ కన్నా పెద్దవారు ఎవరూ లేకపోతే కనీసం మీ సోదరి ప్రియాంకా గాంధీ దగ్గరైనా మాట్లాడే కళ నేర్చుకోండి అని అమిత్ షా హితవు పలికారు.

నువ్వు పిరికివాడివి, నాకు భయపడుతున్నావా? వంటి మాటలు ప్రతిపక్ష నేత స్థాయికి తగవు. మీ భాష ఈ సభ గౌరవాన్ని దెబ్బతీస్తోంది. దేశం మిమ్మల్ని చూస్తోంది, మీ పార్టీని ప్రజలు గమనిస్తున్నారు అంటూ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *