Mudragada: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆయన కుమార్తె ముద్రగడ క్రాంతి చేసిన ఆరోపణలపై ముద్రగడ బహిరంగ లేఖతో స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రాంతి జనసేన పార్టీలో చేరిన తర్వాతే తండ్రీ–కూతుళ్ల మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ముదిరించాయి. తండ్రిని ఆయన కుమారుడు గిరి బలవంతంగా నిర్బంధిస్తున్నారని, క్యాన్సర్ చికిత్సకు కూడా ఆటంకాలు కలుగజేస్తున్నారని క్రాంతి పేర్కొన్నారు. తండ్రి సంరక్షణ తనకెంతో అవసరమని ఆమె తెలిపింది.
ఈ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ ద్వారా స్పందిస్తూ, తన కుమార్తె చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేల్చిచెప్పారు. ఆమె పేరు కూడా ప్రస్తావించకుండానే, “ఒక కుటుంబం మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది” అని మండిపడ్డారు. తన ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి కారణం చిన్న కుమారుడు గిరేనని, ఆయన తల్లిదండ్రుల బాధ్యతను ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు.
“మా అబ్బాయి గిరి రాజకీయంగా ఎదుగుతుంటే కొంతమందికి అసహనంగా ఉంది. వాళ్లకు మేము సహాయం అడిగామా? డబ్బులు కోరామా? సంబంధం లేకపోయినా ఇలా వ్యవహరిస్తున్నారు,” అని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, “నా మనవాళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తాను. అవసరమైతే వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళతాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కుమారుడి రాజకీయ ఎదుగుదలపై కొన్ని శక్తులు అసూయతో కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
“నా కొడుక్కి నాకు మధ్య మనస్పర్థలు పెంచాలనే ప్రయత్నాలు వదలాలి. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా, వారి గుమ్మం వైపు ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలెత్తినా నడకేను,” అంటూ తుదిలో తేల్చిచెప్పారు.