Weather Report

Weather Report: ఉత్తరాది రాష్ట్రాలలో పొగమంచు దెబ్బ.. నిలిచిపోయిన రైళ్లు, విమానాలు

Weather Report: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రాజధాని నగరం ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిసెంబరు నెలాఖరు నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు దట్టమైన పొగమంచు ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసింది. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్ గా ఈ ప్రాంతాల్లో నమోదు అయింది. రోడ్లపై ఎక్కడికక్కడ దట్టంగా మంచు కురుస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు హెడ్‌లైట్లు వేసుకుని నడుస్తున్నాయి. మరోవైపు రోడ్డు రవాణా మాత్రమే కాకుండా విమాన, రైలు రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అమృత్‌సర్, గౌహతికి విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

రాజధాని ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. పట్టాలపై మంచు కురుస్తున్నందున తక్కువ వేగంతో రైళ్లను నడపాలని రైలు ఆపరేటర్లకు అధికారులు సూచించారు. ప్రయాణీకులు తమ ప్రయాణ సమయాలను నిర్ధారించుకోవడానికి విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

విపరీతమైన చలితో అల్లాడుతున్న ప్రజలు వెచ్చదనం కోసం, మంచు ప్రభావం నుంచి తమను తాము రక్షించుకునేందుకు క్యాంప్ ఫైర్లు వేసుకుంటున్నారు. జనవరి 8 వరకు ఇదే వాతావరణం కొనసాగవచ్చని, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *