Mohammed Rafi: మహమద్ రఫీ పేరు వినగానే ఆయన పాడిన మరపురాని పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. భారతదేశం గర్వించదగ్గ గాయకుల్లో రఫీ ముందు వరుసలో ఉంటారు. గాన గంధర్వుడైన యస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సైతం రఫీ అంటే ఎంతో అభిమానం. వెయ్యికి పైగా చిత్రాల్లో ఐదు వేలకు పైగా పాటలు పాడిన రఫీ జీవిత కథను వెండితెరపైకి తీసుకువచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు షాహిద్ రఫీ గోవాలో జరుగుతున్న ఇఫి వేడుకల్లో ఈ విషయాన్ని తెలియచేశారు. రఫీ జీవిత చరిత్రను డైరెక్ట్ చేసే ఛాన్స్ ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేష్ శుక్లాకు దక్కింది. పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ గా మహమద్ రఫీ లైఫ్ హిస్టరీని తీయనున్నామని, ఇందులో ఆయన పాడిన పాటలు కూడా చోటు చేసుకుంటాయని అంటున్నారు షాహిద్ రఫీ. డిసెంబర్ 24న రఫీ జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. రఫీ పాత్రను ఎవరు పోషిస్తారు? ఆ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
