MLA Maganti Gopinath: తెలంగాణ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్‌ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం (జూన్ 8) తెల్లవారుజామున 5:45 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు.
మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. మరణవార్త తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని కడసారి వీడ్కోలు పలికారు.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
అంత్యక్రియలకు అధికార లాంఛనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంతిమ గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతేగాక, ఆయన చికిత్సకు సంబందించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
విశేషమైన రాజకీయ ప్రస్థానం
మాగంటి గోపీనాథ్ 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా, అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

