MK Stalin: తమిళనాడులో నిరసన జ్వాలలు తప్పవు.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్.

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తమిళనాడు రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చే నోటి మాటల హామీలపై తమకు నమ్మకం లేదని, చట్టసభల్లో రాష్ట్రాలకు రక్షణ కల్పించేలా గట్టి భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పునర్విభజన కోసం ఏర్పాటు చేయనున్న కమిషన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను పెంచుకుని, తమ మాట వినని రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేలా ఈ ప్లాన్ ఉందని ఆయన విమర్శించారు. ఇది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికేనని ఆయన స్పష్టం చేశారు.

జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం ఈ బిల్లు ద్వారా శిక్షించాలని చూస్తోందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాను తగ్గించినందుకు అభినందించాల్సింది పోయి, పార్లమెంట్‌లో ఆ రాష్ట్రాల గొంతు నొక్కేలా సీట్లను తగ్గించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కి, మెజారిటీ ఉందని కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన హెచ్చరించారు.

ఈ బిల్లును ఒక “నల్ల చట్టం”గా అభివర్ణించిన స్టాలిన్, తమిళనాడు ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ విభేదాలు పక్కన పెట్టి ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం గనుక తన మొండి వైఖరిని మార్చుకోకపోతే, తమిళనాడు వీధుల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడతాయని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ బిల్లును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్టాలిన్ స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *