Nara Lokesh: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన రక్షణ రంగ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరియు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయో వివరించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుల జోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
‘నమో’ అంటే సరికొత్త అర్థం
దేశ రాజకీయాల్లో ‘నమో’ (NAMO) అంటే నరేంద్ర మోదీ అని అందరికీ తెలుసని, అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నమో అంటే నాయుడు ఇంకా మోదీ అని లోకేష్ అభివర్ణించారు. ఈ ఇద్దరు అగ్రనేతల కలయికతో రాష్ట్రం ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ వేగంతో దూసుకుపోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాజ్‌నాథ్ సింగ్ అలాగే రాష్ట్రంలో చంద్రబాబు.. ఈ ముగ్గురూ 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాళ్లలా అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.
ఫ్యాక్షన్ వర్సెస్ ఫైటర్ జెట్
రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత పాలకులది ‘ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్’ అయితే, తమది అభివృద్ధిని కాంక్షించే ‘ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్’ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు కరువుతో అల్లాడే రాయలసీమ గడ్డపైకి కియా వంటి కార్ల పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు అదే నేలపై యుద్ధ విమానాల తయారీ కేంద్రాలను (AMCA ప్రాజెక్ట్) తీసుకువచ్చిన వ్యక్తి కూడా ఆయనేనని గుర్తు చేశారు.
పుట్టపర్తి ఆధ్యాత్మికం నుండి పారిశ్రామికం వరకు
పుట్టపర్తి ఎదుగుదల గురించి లోకేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 1991లో సత్యసాయి బాబా గారు ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మిస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయారని, కానీ ఆయన విజన్ వల్లే ఇప్పుడు ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు.
ఇప్పుడు ఇదే ఆధ్యాత్మిక కేంద్రం రక్షణ రంగ హబ్‌గా మారుతోందని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటామని, రాష్ట్రంలో పెట్టుబడుల వరద ఇలాగే కొనసాగుతుందని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
