Chandrababu Naidu: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ భవిష్యత్తుపై కీలక ప్రసంగం చేశారు. గురువారం పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన రక్షణ రంగ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రాంతాన్ని దేశం గర్వించే రక్షణ మరియు పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పుట్టపర్తి అనగానే సత్యసాయి బాబా గుర్తుకొస్తారని, ఆయన చూపిన శాంతి మార్గంలోనే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
డిఫెన్స్ మరియు టెక్నాలజీ హబ్‌గా పుట్టపర్తి
భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన AMCA (Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో పుట్టపర్తికి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్షణ రంగంతో పాటు సాంకేతికతలోనూ ఏపీ ముందడుగు వేస్తోందని చెబుతూ.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ‘డ్రోన్ సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని, శ్రీహరికోట పక్కనే ‘స్పేస్ సిటీ’ రాబోతుందని వెల్లడించారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక రక్షణ కవచంలా నిలబడబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాయలసీమ రూపురేఖలు మార్చిన ఎన్టీఆర్
ఒకప్పుడు ఎడారిగా మారుతున్న రాయలసీమను కాపాడింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారేనని చంద్రబాబు కొనియాడారు.
-
నీటి ప్రాజెక్టులు: సీమకు నీళ్లు తీసుకురావాలనే ఎన్టీఆర్ సంకల్పమే నేడు అనేక ప్రాజెక్టుల పూర్తికి దారితీసింది.
-
హార్టికల్చర్ హబ్: రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ. లక్ష కోట్లతో భారీ ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం ప్రకటించారు.
-
కడప స్టీల్ ప్లాంట్: కడప స్టీల్ ప్లాంట్ పనులను జూన్ నెలలో ప్రారంభిస్తామని, 2028 నాటికి దీనిని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు.
బంగారం ఉత్పత్తికి ఏపీ కేరాఫ్ అడ్రస్
ఒకప్పుడు బంగారం అంటే కేజీఎఫ్ (KGF) గుర్తొచ్చేదని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఆ స్థానాన్ని భర్తీ చేయబోతోందని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జొన్నగిరిలో 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఏపీని బంగారం ఉత్పత్తికి చిరునామాగా మారుస్తామని చెప్పారు.
చివరగా, రాయలసీమలోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, ఈ ప్రాంతాన్ని మళ్ళీ ‘రతనాల సీమ’గా మార్చే బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
