Nara Lokesh: సీఐఐ (CII) పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 వేదికగా అత్యంత ఆసక్తికరమైన లైవ్ పాడ్‌కాస్ట్ సెషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి నిర్వహించిన ఈ ప్రత్యేక ముఖాముఖి సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో ఏపీ అభివృద్ధి విజన్, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతికత ఆధారిత పారదర్శక పాలన, యువతకు ఉపాధి అవకాశాలపై మంత్రి లోకేశ్ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని (Business-friendly environment) కల్పిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. కేవలం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాత్రమే కాకుండా, ప్రాజెక్టుల అమలులో వేగం, సమర్థత (Speed and Efficiency) తమ ప్రభుత్వ ప్రధాన మంత్రమని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), తయారీ రంగం (Manufacturing), పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం (Renewable Energy & Green Tech) వంటి కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లు, పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా పేపర్‌లెస్, పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. పరిపాలనా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం వల్ల అధికారుల జాప్యం, అవినీతికి ఆస్కారం లేకుండా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, ఇది దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై బలమైన నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు.
దీనితో పాటు, ఆధునిక జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తూ, యువతలో నైపుణ్యాలను (Skill Development) మెరుగుపరచడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని 2026 మరియు ఆ తర్వాతి భవిష్యత్ ప్రణాళికలను మంత్రి లోకేశ్ వివరించార.
