Rahul Gandhi

Rahul Gandhi: నా ఫోన్ మోదీ ట్యాప్ చేస్తున్నారు.. ఆధారాలన్నీ ఇందులోనే ఉన్నాయి!

Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్‌కు చేరింది! సోషల్ మీడియాలో నెటిజన్లతో నిర్వహించిన ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ (Q&A) సెషన్‌లో రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు “ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఆయన విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారనడానికి ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే ఉన్నాయి” అని రాహుల్ గాంధీ ఆరోపించగా.. మరోవైపు బీజేపీ నేతలు రాహుల్ వ్యాఖ్యలను ‘చీప్ పాలిటిక్స్’ అంటూ తీవ్రంగా తిప్పికొట్టారు. ఈ పొలిటికల్ హీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!

“ఆధారాలు ఎక్కడ?” అన్న నెటిజన్.. తన ఫోన్ చూపించిన రాహుల్!

ప్రధాని మోదీతో చర్చించడానికి ఎలాంటి అంశాలు ఎంచుకోవాలో సలహాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లను కోరారు.ఈ క్రమంలో ఒక యూజర్ స్పందిస్తూ.. “మీరు విదేశీ సాయం పొందుతున్నారని మోదీ అంటున్నారు.. మోదీ విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారని మీరు అంటున్నారు.. అసలు దీనికి ఆధారాలు ఎక్కడ?” అని ప్రశ్నించారు.

దీనికి రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్‌ను కెమెరాకు చూపిస్తూ సమాధానమిచ్చారు. “ఆధారం ఇక్కడే ఉంది.. ఈ ఫోన్‌లోనే ఉంది. ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.అంతేకాకుండా, పార్లమెంట్‌లో చైనా, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ (SIR), ఎప్‌స్టీన్ వంటి అంశాలపై తాను మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా తన మైక్ ఆఫ్ చేశారని ఆయన విమర్శించారు.

టెలిప్రాంప్టర్ తెచ్చుకోండి, మీ జడ్జిని పెట్టుకోండి.. కానీ చర్చకు రండి!

దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ టెలిప్రాంప్టర్ ఉపయోగించడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఎక్స్ (X) వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మోదీ జీ.. మీ సొంత మీడియా కార్యక్రమంలో, మీ మనుషుల మధ్య మాట్లాడటానికి కూడా టెలిప్రాంప్టర్ అవసరమా? చూస్తుంటే మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది” అని రాహుల్ ఎద్దేవా చేశారు.

సరే పర్వాలేదు.. నాతో జరిగే ముఖాముఖి చర్చకు కూడా మీరు టెలిప్రాంప్టర్ తెచ్చుకోండి, మీకు నచ్చిన వారినే జడ్జిగా పెట్టుకోండి. కానీ ముందు చర్చకు రండి. అప్పుడు ఎవరు విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మలో, ఎవరు దేశద్రోహులో దేశ ప్రజలందరికీ తెలుస్తుంది” అని రాహుల్ సవాల్ విసిరారు.

అలాగే, తన తల్లి సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్’ (Belonging) పుస్తకంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. అది అద్భుతమైన పుస్తకం కాబట్టే చదవకుండా ఉండలేకపోతున్నారని, చాలామంది బీజేపీ నేతలకు లోలోపల సోనియా గాంధీ అంటే ఇష్టమని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ – ‘చీప్ పాలిటిక్స్’ అంటూ కౌంటర్..

రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, బహిరంగ చర్చ సవాల్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు, చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. మా గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించే స్థాయి, అర్హత రాహుల్‌కు లేవు అని కౌంటర్ ఇచ్చారు.

నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం రాహుల్ గాంధీకి పాత అలవాటే. కేవలం గందరగోళం సృష్టించే రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు” అని బీజేపీ నేతలు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *