MAOIST: ఇటీవల మంత్రి సీతక్కను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు హెచ్చరికల లేఖ రాశారన్న వార్తలు సంచలనంగా మారాయి. అయితే, ఈ ప్రచారంపై మావోయిస్టు పార్టీ తాజాగా స్పందించింది. మంత్రి సీతక్కపై తమ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ జూన్ 26, 2025న వెలువడిన లేఖకి తమకు ఎలాంటి సంబంధం లేదని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “ఆపరేషన్ కగార్”ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, ఎన్‌కౌంటర్లను ఆపాలని డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలు రాష్ట్రంలో లేకపోయినా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు బెదిరిస్తున్నారని విమర్శించారు.
దామోదర్ లొంగుబాటుపై ప్రచారం అవాస్తవం
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ లొంగిపోయినట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. ఇదంతా పోలీసుల రూపొందించిన దుష్ప్రచారమని తెలిపారు. గతంలోనూ దామోదర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు లేదా లొంగిపోయినట్టు అవాస్తవ ప్రచారం జరిపిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలను మానసికంగా గందరగోళపరచడానికే ఈ ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది.