Manmohan Singh: భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త దివంగత మన్మోహన్‌సింగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాప ప్రకటనలు చేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఓ అరుదైన నేతగా అభివర్ణించారు. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణను సాకారం చేసిన ప్రధానిగా కూడా ఆయనను తెలంగాణ యావత్తు కొనియాడుతున్నది.
భారత్ ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది, ఆర్థిక సంస్కరణల్లో మన్మోమన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశ ఆర్థిక విధానంపై మాజీ ప్రధానిగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మన్మోహన్‌సింగ్ బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో మన్మోహన్‌సింగ్ చేసిన ప్రసంగాలు అద్భుతమైనవి. ఆయన సేవలు కొనియాడదగ్గవి. – ప్రధాన మోదీ
మన్మోహన్‌సింగ్ ఒక లెజెండ్. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్‌సింగ్ దేశానికి వెలకట్టలేని సేవలందించారు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు మన్మోహన్ ప్రతీక. – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా మన్మోహన్‌సింగ్ విద్వత్తును ప్రదర్శించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. – తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
దేశానికి మన్మోహన్‌సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆర్థికరంగ అభివృద్ధికి దోహదం చేశారు. – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్‌సింగ్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే
దేశ పాలనలో మన్మోహన్‌సింగ్ పాత్ర కీలకం. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారు. – కేంద్ర మంత్రి అమిత్‌షా